హన్మకొండ: అర్హత సాధించినా పోస్టింగ్ అందక విద్యుత్ కన్వర్షన్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన జూనియర్ లైన్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు పదోన్నతిపై భర్తీకి అవకాశం కల్పించింది. ఈ మేరకు డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ డిప్లొమో కోర్సు పూర్తి చేసుకున్న వారిని అర్హులుగా ప్రకటించింది. దీంతో అర్హత ఉండి ఆసక్తి కలిగిన విద్యుత్ జూనియర్ లైన్‌మెన్లు, ఆఫీస్ సబార్డినేట్‌లు దరఖాస్తు చేసుకోగా వారికి యాజమాన్యం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో హనుమకొండ సర్కిల్‌లో తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పదోన్నతికి అర్హత సాధించారు. వీరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయ్యింది. వీరికి పది రోజులుగా పోస్టింగ్ ఇవ్వకుండా హనుమకొండ సర్కిల్ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. పదోన్నతి పొందిన ఉద్యోగుల పోస్టింగ్‌లలో యూనియన్‌లు జోక్యం చేసుకోవడంతో సమస్య జఠిలంగా మారిందని విద్యుత్ ఉద్యోగ వర్గాలు తెలిపాయి.
36 పోస్టులకు తొమ్మిదే భర్తీ..
హనుమకొండ సర్కిల్‌లో 36 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో భర్తీ చేసేది 9 మాత్రమే. కొరత లేకుండా భర్తీకి పోస్టుల అంశంలో ఎలాంటి అవరోధాలు లేకున్నా అధికారులు పదోన్నతి ఉత్తర్వులు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరకాల, కమలాపూర్, భీమదేవరపల్లి ఈఆర్‌ఓలు, ఇతర కార్యాలయాల్లో భారీగా ఖాళీలున్నా వాటిని భర్తీ చేయడంపై అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న వారిపై అదనపు భారం పడుతున్నా... అందుబాటులో అభ్యర్థులున్నా భర్తీ చేయకపోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాగా, 9 మంది ఉద్యోగుల్లో యూనియన్ల పరంగా పంచుకుని జిల్లా కేంద్రంలో పోస్టింగ్ కోసం ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
ఒక్క పోస్టు వద్ద యూనియన్ల పట్టుదల..
టీఆర్‌వీకేఎస్ 2 పోస్టులు, టీఆర్‌పీఈయూ 3 పోస్టులు, టీఎస్ ఈఈయూ–327 నాలుగు పోస్టుల కోసం పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక్క పోస్టు వద్ద ఓ రెండు యూనియన్లు పట్టుదలకు పోయినట్లు తెలిసింది. హనుమకొండ డివిజన్‌లో ఒక సంఘంలో ఉన్న ఉద్యోగి మరో సంఘంలో చేరింది. దీంతో ఈ పోస్టు తమదంటే తమదని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమాచారం. విద్యుత్ ఉద్యోగుల సంఘాలు, అధికారుల మూలానా పదోన్నతి పొందిన ఉద్యోగులు నష్టపోతున్నారు. వీరితో స్క్రీనింగ్ టెస్ట్ ఉత్తీర్ణులై అర్హత సాధించిన ఇతర సర్కిల్ ఉద్యోగులు తమ సర్కిల్‌లో ఎప్పుడో పోస్టింగ్‌లు పొందారు. అయితే హనుమకొండ సర్కిల్‌లో మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీరికి సర్వీస్ సీనియారిటీలో వెనుకబడి పోతారని, తదుపరి పదోన్నతిలో నష్టం జరుగుతుందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. పోస్టింగ్‌ల ఆలస్యంపై పదోన్నతి పొందిన అభ్యర్థులకు మద్దతుగా కొన్ని యూనియన్లు ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఈ విషయమై హనుమకొండ ఎస్‌ఈ బి.సామ్యా నాయక్‌ను వివరణ కోరగా యూనియన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో పోస్టింగ్‌లలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
అర్హత సాధించిన కన్వర్షన్ ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురుచూపు
టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్‌లో 36 ఖాళీలు..పోస్టింగ్ ఇవ్వాల్సింది 9 మందికే
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో మీనమేషాలు


