సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకచోట ఫ్లెక్సీల తొలగింపు వివాదం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలను తెరపైకి తెస్తుండగా.. మరోచోట ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన నాయకుడి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య నెలకొన్నట్లు ప్రచారంలో ఉన్న విభేదాలు తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఫ్లెక్సీల తొలగింపుతో చర్చకు వచ్చాయి. వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సోదరుడు విజయభాస్కర్ మధ్య మాటల యుద్ధం బహిరంగమైంది.
పరకాలలో ఫ్లెక్సీల చిచ్చు..
పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ దుబ్బాసి వెంకటస్వామితోపాటు పలువురు నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యం ఉండటం, చల్లా ధర్మారెడ్డి ఫొటో లేకపోవడం వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీల తొలగింపు వెనుక ఎవరున్నారు? ఎవరి ఆదేశాలతో ఈ పని జరిగింది? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
భవిష్యత్ రాజకీయ సమీకరణాల కోసమేనా?
పరకాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎప్పటినుంచో పరకాలపై కన్నేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన ఫౌండేషన్ ద్వారా సేవ, యువతకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో ఇద్ద రూ కలిసి ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలూ ఉన్నాయి. తాజా ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య రాజకీయ సమన్వ యం, ప్రాధాన్యంపై చర్చ మొదలైంది. రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం, రాజ కీయ ప్రాధాన్యం ఎవరికి దక్కుతుందన్న అంశం ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తావనకు వస్తోంది.
వరంగల్ పశ్చిమలో వారసుల వార్..
మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సోదరుడు విజయభాస్కర్ మధ్య వివాదం బహిరంగమైంది. సోషల్ మీడియాలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు, వీడియోలు పెడుతున్నారని విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయభాస్కర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలోకి బీరు సీసాలు విసిరిన ఘటనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టలేదని, ఇప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విజయభాస్కర్ విమర్శించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై గౌరవం ఉందంటూనే.. ఆయన అల్లుడిని ఉద్దేశించి ‘దశమగ్రహం’అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రం ఆ ఆరోపణలకు సంబంధం లేనట్లుగా స్పందించడం లేదు.
అంతర్గతంగానూ..
వరంగల్ పశ్చిమలో నాయిని రాజేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ మధ్య గతంలో భద్రకాళి చెరువు, ఆలయ మాడవీధుల విస్తరణ, గుడిసెల తొలగింపువంటి అంశాలపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. తాజాగా కుటుంబ సభ్యుల పేర్లు వివాదంలోకి రావడంతో రాజకీయ పోరు మరో కోణం సంతరించుకుంది. రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండాల్సి ఉండగా.. ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యక్తిగత విమర్శలు చర్చనీయాంశంగా మారడంపై చర్చ జరుగుతోంది. కాగా, రానున్న రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో రాజకీయ రగడ..
భవిష్యత్ ఎన్నికల కోసం
అక్కడ సమీకరణాలు..
రాజకీయ ఆధిపత్యం కోసం
ఇక్కడ ఎత్తుగడలు.
చర్చనీయాంశంగా మారిన
రెండు నియోజకవర్గాల పరిణామాలు


