దీపావళి వేడుకల్లో ప్రమాదాలు.. పది మందికి గాయాలు
సాక్షి, వరంగల్ : దీపావళి పండుగ బాణసంచా పేలుళ్లు పలువురిని ఆస్పత్రులపాలు చేశాయి. వరంగల్ నగరంలో దీపావళి సందర్భంగా పటాకులు కాల్చుతూ పది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు రాగా.. మరో ఆరుగురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. బాధితులు నగరంలోని కీర్తినగర్, దేశాయిపేట, హనుమకొండ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ముఖ్యంగా కంటికి గాయాలవడం ఆందోళన కలిగిస్తోంది.
కుడి, ఎడమ కళ్లకు గాయాలు...
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల వైద్యుల వివరాల ప్రకారం... ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు నాలుగు కంటి గాయాల కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరికి కుడి కంటికి, మరొకరికి ఎడమ కంటికి గాయాలైనట్లు వైద్య నివేదిక రికార్డుల్లో పేర్కొన్నారు. ఇంకొకరికి సాధారణ గాయాలయ్యాయి. బాధితులకు అవసరమైన మందులు సూచించారు. మరొకరికి నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్ మాత్రలు ఇచ్చారు. బాణసంచా పేలుడు ధాటికి కంటిలోని సున్నితమైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వైద్యులు ప్రత్యేకంగా పరీక్షించి చికిత్స అందించారు. నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరుగురు గాయాలతో చేరారు. దీపావళి ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. ఈ నెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చే ఆనవాయితీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నేత్రవైద్యులు సూచిస్తున్నారు.
చూపుపై ప్రభావం పడే ప్రమాదం...
బాణసంచా పేలినప్పుడు వెలువడే వేడి, నిప్పురవ్వలు, చిన్న చిన్న లోహ, కాగితపు ముక్కలు నేరుగా కంటిని తాకితే తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. కార్నియా దెబ్బతినడం, కనురెప్పలకు కాలిన గాయాలు, రెటీనా దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలకు టపాసులు ఇచ్చి ఒంటరిగా వదలకూడదు. రాకెట్లు, చిచ్చుబుడ్లు, ఇతర బాణసంచాను జనసంచారం లేని బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చాలి. టపాసులు వెలిగించేటప్పుడు ముఖాన్ని దగ్గరగా పెట్టకూడదు. కంటికి నిప్పురవ్వ తగిలినా, గాయమైనా చేతులతో రుద్దకూడదు. వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. పండుగ సంబరాల కంటే ప్రాణాలు, చూపు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– డాక్టర్ రవిశేఖర్, వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో నలుగురు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో
ఆరుగురికి చికిత్స
24న కార్తీక పౌర్ణమి వేళ అప్రమత్తత
అవసరమంటున్న వైద్యులు


