● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట : ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. దీపావళి పండుగ మరుసటి రోజు కావడంతో ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మొత్తంగా 56 అర్జీలు రాగా వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖ –22, మున్సిపల్ కార్పొరేషన్–8, డీఆర్‌డిఏ–4, హౌసింగ్–3, ఎంజీఎం–3, వివిధ శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు సమర్పించారు. వరంగల్ నూతన కలెక్టరేట్‌ను వెంటనే ప్రారంభించాలని విద్యావంతుల వేదిక బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్ కుమార్, వై.వీ.గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి : రవి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి.. సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌తోపాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో 39, ఆర్డీఓ కార్యాలయాల్లో 6, ఎంపీడీఓ కార్యాలయాల్లో 39, మొత్తం 84 అర్జీలు అందాయి. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఆర్‌డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు.


