హన్మకొండ/కాశిబుగ్గ/ఖిలా వరంగల్: వరంగల్ మహానగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు, కాలనీల రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాలు ఎత్తుకుపైగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు, ఎత్తు తక్కువ ఉన్న నాలుగు చక్రాల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురిస్తే హనుమకొండ సుబేదారి, నక్కలగుట్ట మీదుగా అంబేడ్కర్ కూడలి వరకు నిర్మించిన డక్ట్ డ్రెయిన్‌తో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు, వాహనదారులు తెలిపారు. ఈ డక్ట్ అండ్ డ్రెయిన్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, ఇందులో నుంచి వరద నీరు వెళ్లడం లేదని, దీంతో రోడ్డుపైనే నీరు నిలుస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికులకు ఇబ్బంది..
భారీ వర్షానికి వరదనీరు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌లోకి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్‌స్టేషన్ ఆవరణలోని సిటీ బస్ స్టేషన్‌లోకి మురుగు నీరు మురుగు చేరుకోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదని, ఆర్టీసీ అధికారులు, వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వరంగల్ ఉర్సులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వరంగల్ ఉర్సులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం
గంటసేపు వానతో అతలాకుతలం
రోడ్లపైకి వరదనీరు చేరి
రాకపోకలకు ఆటంకం


