వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సందర్శించారు. ఒకరు ఆస్పత్రి లోపల, మరొకరు ఆస్పత్రి బయట పనులు పరిశీలించారు. ఇద్దరు జిల్లా పాలనాధికారులు వేర్వేరుగా సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. వీరి పర్యటన సమయంలో వైద్యాధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆస్పత్రి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రి లోపల వివిధ విభాగాల వారీగా కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేశ్‌బాబు, ఈఈ రాజేందర్ ఉన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణ వెలుపల జరుగుతున్న అభివృద్ధి పనుల పరోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేశ్‌బాబు, కార్పొరేషన్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్ ఉన్నారు.
ఆస్పతి బయట పనులపై ఆరా తీస్తున్న హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
పనుల వివరాలు తెలుసుకుంటున్న వరంగల్ కలెక్టర్ సత్యశారద


