● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
హసన్‌పర్తి: మహిళా పోలీసుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిహించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆత్మీయ సమ్మళనం ఆదివారం భీమారంలోని శుభం గార్డెన్‌లో నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకొస్తున్నారని కొనియాడారు. గైనకాలజిస్ట్ రాధిక మాట్లాడుతూ మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. న్యూట్రిషనిస్ట్ శ్రీలత మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రాధ మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు సువర్ణ, సుజాత, ఎస్సైలు కిరణ్మయి, శ్రావణి, లలిత, స్వాతి, కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 360 మంది మహిళా సిబ్బంది పాల్గొన్నారు.


