హన్మకొండ అర్బన్: ఈనెల 24, 26 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని కోరారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, తనిఖీ బృందాల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 24న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2), 26న కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ల నియామక పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, అభ్యర్థులు గమనించి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
ఐదు కేంద్రాల్లో పరీక్షలు
జిల్లాలోని వడ్డేపల్లి అయాన్ డిజిటల్ జోన్, ఎరగ్రట్టు గుట్ట కిట్స్ కళాశాల, గోపాల్‌పూర్ కల్లు మండవ కూడలి వద్ద ఉన్న ఎన్‌ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హసన్‌న్‌పర్తిలోని చింతగట్టు ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న నోబెల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, ములుగు క్రాస్‌రోడ్డులోని శ్రీ గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2) పరీక్షకు 1,320 మంది, అసిస్టెంట్ ఎన్విరాన్‌న్‌మెంటల్ ఇంజనీర్ల పరీక్షకు 1,225 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీశంకర్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్‌రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్‌సింగ్, పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రమోహన్, విద్యుత్ శాఖ సహాయ విభాగాధికారి గంగారెడ్డి, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద
163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు : సీపీ
హసన్‌పర్తి: ఈ నెల 24, 26వ తేదీల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించే అసిస్టెంట్ సైంటిస్టు (అనలిస్ట్ గ్రేడ్–2), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ రాత పరీక్షల కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలలో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ, మామునూరు, నర్సంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని సంబంధిత పరీక్ష కేంద్రాల చుట్టూ 500 గజాల పరిధిలో ఆయా తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
అభ్యర్థులు సకాలంలో
పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


