కేయూ క్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న అండర్–19 రాష్ట్ర లీగ్ క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన రెండు మ్యాచుల్లో అచ్చంపేట, వికారాబాద్ జట్లు విజయం సాధించినట్లు టీసీఏ బాధ్యుడు జైపాల్ తెలిపారు. అచ్చంపేట జట్టు, మహబూబ్నగర్ జట్లు తలపడగా తొలుత బ్యాటింగ్కు దిగిన అచ్చంపేట జట్టు 18.4 ఓవర్లలో 99 పరుగులకు ఆలవుటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన మహబూబ్నగర్ జట్టు 14.3ఓవర్లలో 62 పరుగులకే ఆలవుట్ కావడంతో అచ్చంపేట జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో వికారాబాద్, నారాయణపేట జట్లు తలపడగా వికారాబాద్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వికారాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. ఆ తరువాత బరిలోకి దిగిన నారాయణ పేట జట్టు 15.5ఓవర్లలో 59 పరుగులకే ఆలవుటైంది. దీంతో 91 పరుగుల భారీ తేడాతో వికారాబాద్ జట్టు విజయం సాధించింది.
ముగిసిన టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని లాన్ టెన్నిస్ కోర్టులో రెండు రోజుల పాటు జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు శుక్రవారం ముగిశాయి. లీగ్ కం నాకౌంట్ పద్ధతిలో హోరాహోరీగా సాగిన పోటీల్లో చాంపియన్ షిప్ కోసం ఉమ్మడి 10 జిల్లాల జట్లు తీవ్ర పోటీ కనబరిచాయి. ఇందులో అండ్ –17 బాలబాలికల విభాగాల్లో రంగారెడ్డి జిల్లా జట్లు చాంపియన్షిప్ కౌవసం చేసుకోవడం విశేషం. అండర్ –19 బాలుర విభాగంలో హైదరాబాద్, బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా విజేతలుగా నిలిచి ట్రోఫీని అందుకున్నాయి.
ఆహార కల్తీ చట్టాలపై
అవగాహన కలిగి ఉండాలి
కాశిబుగ్గ: ఆహార కల్తీ చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అవగాహన ఉన్నప్పుడు వినియోగదారులు మోసపోవడానికి ఆస్కారం ఉండదని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా వినియోగదారుల మండలి జాతీయ కమిటీ బాధ్యులు పోచమ్మ మైదాన్లో శుక్రవారం వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత కోసం ప్రభుత్వరంగ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. ప్లాస్టిక్, చెత్త డంపింగ్తో పర్యావరణానికి హానితో పాటు వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సదస్సులో ఖిలా వరంగల్ , వరంగల్ తహసీలార్లు ఎండీ ఇక్బాల్, శ్రీకాంత్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, వినియోగదారుల జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, జాతీయ ఉపాధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, మొగిలిచర్ల సుదర్శన్ పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో
ఈహెచ్ఎస్ అమలు
కాశిబుగ్గ: వరంగల్ జిల్లాలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలు చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇక గుర్తింపు పొందిన ప్రైవేట్ క్లినిక్లు, హాస్పిటల్స్, నర్సింగ్ హోంలలో ఈహెచ్ఎస్ వర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. వరంగల్లోని సంరక్ష, గంగా, ఎన్ఎస్ఆర్, క్యూర్వెల్, బాలాజీ, సత్య హాస్పిటళ్లలో వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


