ఉమ్మడి వరంగల్ జిల్లాలో
79 పీఎం శ్రీ స్కూళ్లు
పీఎంశ్రీ స్కూళ్లలో ప్రత్యేక అవసరాల టీచర్ల నియామకాలు
విద్యారణ్యపురి: పీఎం శ్రీ స్కూళ్లలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం సమ్మిళిత విద్యను బలోపేతం చేసే దిశగా ఆయా స్కూళ్లలో గెస్ట్ (అతిథి) ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయుల నియామకాలు తాత్కాలిక పద్ధతిన నియమించుకునేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ప్రత్యేక అవసరాల పిల్లలకు పాఠశాల స్థాయిలో నిర్దేశిత భవిత కేంద్రాల ద్వారా తగిన విద్యాసాయ సేవలు అందించి సమ్మిళిత విద్యను బలో పేతం చేయడమే ఈ నియామకాల లక్ష్యంగా ఉంది.
మార్గదర్శకాలు జారీ..
తాత్కాలిక పద్ధతిన ఐదు నెలల కాల వ్యవధికి ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యనందించేందుకు ఉపాధ్యాయులను నియమించుకోవాల్సి ఉంటుంది. గౌరవ వేతనం ఒక్కో టీచర్‌కు ప్రతీనెల రూ. 16,500 చొప్పున ఐదు నెలలకు మొత్తం రూ. 82 వేల 500 చెల్లిస్తారు.
అర్హతలు..
గెస్ట్ (అతిథి) ప్రత్యేక అవసరాల అధ్యాపకులుగా నియమితులయ్యే వారికి బీఎడ్ (ప్రత్యేక విద్య)తో గ్రాడ్యుయేట్ బీఎడ్ (జనరల్ )తోపాటు ఆ ప్రత్యేక విద్యలో ఒక సంవత్సరం డిప్లొమా, బీఎడ్‌తోపాటు ప్రత్యేక విద్యలో రెండు సంవత్సరాల డిప్లొమా, ప్రత్యేక విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ డిప్లొమా, దృష్టిలోపంలో సెకండరీ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు అర్హులు.
స్థానికులకు ప్రాధాన్యం..
ఈ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు. అర్హులైన అభ్యర్థుల్లో అనుభవం ఉన్నవారికి కూడా ప్రాధాన్యతనిస్తారు. ప్రతీజిల్లాలోనూ విద్యాశాఖ ఈనెలలో దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేయనుంది. ఈఏడాది నవంబర్ 1 నుంచి ఐదు నెలలపాటు వీరి సేవలను వినియోగించుకుంటారు. హనుమకొండ జిల్లాలో ఈనెల 7వతేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మిగతా జిల్లాల డీఈఓలు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయుల విధులు, బాధ్యతలు..
● ప్రత్యేక విద్య సాయం అవసరమైన ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి అంచనా వేయడం,
● ప్రత్యేక అవసరాల నమోదు, తరగతి మార్పులో సహకరించడం
● భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలు అందించడంలో అందుబాటులో ఉండాలి.
● అవసరమైనప్పుడు పాఠశాల,ఇంటి సందర్శనలు, తగిన కౌన్సెలింగ్ మార్గదర్శకం ఇవ్వడం.
డీఈఓలు పర్యవేక్షణ..
● జిల్లాల్లో ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయుల నియామకాలు, పనితీరుపై జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర పర్యవేక్షణ నిర్వహిస్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పీఎం శ్రీ స్కూళ్ల వివరాలు
జిల్లా పీఎంశ్రీస్కూళ్లు గౌరవవేతనం
ఐదునెలలకు (రూ.ల్లో)
హనుమకొండ 16 13,20,000
వరంగల్ 14 11,55,000
జనగామ 14 11,55,000
ములుగు 07 5,77,500
మహబూబాబాద్ 21 17,32,500
జయశంకర్‌భూపాలపల్లి 07 5,77,500
మొత్తం 79 65,17, 500
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 79 పీఎం శ్రీస్కూళ్లలో ఈ గెస్ట్ ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఇందుకు మొత్తం ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు రూ. 16,500 చొప్పున ఐదునెలలకు రూ.82, 500 వేతనం చెల్లిస్తారు. ఆరు జిల్లాలోని 79 పీఎం శ్రీస్కూళ్లకు 79మంది అతిథి ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించనున్నారు. మొత్తం ఐదు నెలలకుగాను రూ. 65లక్షల, 17, 500 గౌరవ వేతనం కింద నిధులు సమగ్ర శిక్షనుంచి కేటాయించారు. (మంజూరు) పీఎం శ్రీపాఠశాలల హెచ్‌ఎంలు సమగ్ర శిక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు
రూ.16, 500 గౌరవ వేతనం
మార్గదర్శకాలు జారీ..ఉమ్మడి
వరంగల్ జిల్లాలో 79 స్కూళ్లు


