టీమున్సిపల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

టీమున్సిపల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

● రాష్ట్ర అధ్యక్షుడిగా మియాపురం శ్రీకాంతాచారి

హన్మకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు శుక్రవారం హనుమకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జీడబ్ల్యూఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న మియాపురం శ్రీకాంతాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా పి. గాయత్రి, కార్యదర్శులుగా వరయోగుల నరేశ్‌, ధరణికోట సంతోశ్‌, కోశాధికారిగా బేలా చరణ్‌ కుమార్‌, సహ కోశాధికారిగా రంగు యుగేంధర్‌, సంయుక్త కార్యదర్శులుగా వి.మారుతి, సకినాల నాగరాజు, నాయకం గంగాధర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఎస్‌. మాధవి, ఉస్మాన్‌ పాషా, పూజారి కిరణ్‌, అధికార ప్రతినిధిగా తత్తరి లింగనాథ్‌, ముఖ్య సలహాదారులుగా బి.వెంకటరంగ నెహ్రూ, ఎం.డి ఖాజా, నాగ కిరణ్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా ఆర్‌.ప్రశాంత్‌ బాబు, ఎన్‌. నరేశ్‌, మీడియా కన్వీనర్లు ఇబ్రహీం అలీ, హరి ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగుల హక్కులు, వేతన భద్రత, ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా కృషి చేయడమే కమిటీ ప్రధాన లక్ష్యమని శ్రీకాంతాచారి తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, రాజేశ్‌, మహేశ్‌ కుమార్‌, క్రాంతి కుమార్‌, జగదీశ్వర్‌ రెడ్డి, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తప్పిపోయిన వ్యక్తి అప్పగింత

కాజీపేట రూరల్‌: కాజీపేట జీఆర్‌ పోలీసులు శుక్రవారం తప్పిపోయిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన మతిస్థిమితం లేని 50 ఏళ్ల బొల్లపల్లి సుకుమార్‌ కుటుంబీకులతో కలిసి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చర్చికి వచ్చాడు. వారి కళ్లుగప్పి మంచిర్యాల స్టేషన్‌లో బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. కుటుంబీకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాజీపేట హెడ్‌కానిస్టేబుల్‌ ఓంకార్‌, అశోక్‌, కోటేష్‌ అప్రమత్తమై కాజీపేటకు చేరుకున్న రైలులో అన్ని బోగీలను తనిఖీ చేసి సుకుమార్‌ను గుర్తించి కిందికి దింపారు. కుటుంబసభ్యులు రాగా వారికి అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు కాజీపేట జీఆర్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

కాజీపేట అర్బన్‌ : హంటర్‌రోడ్డు న్యూశాయంపేటలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని ల్యాదల్ల అపర్ణ(21) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాజీపేటకు చెందిన అపర్ణ వారం రోజులక్రితం న్యూశాయంపేటలోని డబుల్‌ బెడ్‌రూం ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. కాజీపేట ఫాతీమానగర్‌లోని ఓ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ సెకండియర్‌ చదువుతుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సుబేదారి పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement