న్యూస్‌రీల్
ఎక్కడికక్కడే అక్రమ వసూళ్లు?
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
‘గ్రేటర్’లో వ్యాపార సైన్ బోర్డుల సొమ్ము పక్కదారి
వరంగల్ అర్బన్: విద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న వరంగల్ మహా నగరంలో ప్రచార ప్రకటనలు హోరెత్తుతున్నాయి. భవన అంతస్తుల మేరకు వ్యాపార ప్రకటనలు నిలువెల్లా వెలుస్తున్నాయి. కానీ, బల్దియాకు ఆదాయం మాత్రం సున్నా. ప్రచార బోర్డులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసినా బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఏడాదికోసారి ప్రకటనల పేరుతో వసూళ్లను మరిచి మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 35 వేలకు పై చిలుకు వ్యాపార సంస్థల సైన్ బోర్డులున్నట్లు అంచనా. వీటి ద్వారా బల్దియాకు ప్రతీ ఏడాది రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరాల్సి ఉంది. కానీ, పదేళ్లుగా ఒక్క రూపాయి రావడం లేదు.
ప్రతీ ప్రచార బోర్డుకు
అనుమతి, పన్ను కట్టాలి..
బల్దియాకు వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయాల్లో ప్రకటనలది ఒకటి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి బాట పడుతోంది. వాణిజ్య హోర్డింగులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు(గ్లో సైన్ బోర్డులు) ముందు పెట్టుకున్న బోర్డులనుంచి ప్రకటనలు భారీగా వెలుస్తున్నాయి. జీడబ్ల్యూఎంసీ నిబంధనల ప్రకారం దుకాణాల నేమ్ బోర్డు స్క్వేర్ మీటర్ ఆధారంగా లెక్కించి నిర్దేశించిన సొమ్మును ప్రతీ ఏడాది చెల్లించాలి. కానీ, అనుమతి తీసుకోకపోవడంతోపాటు పన్నులు చెల్లించడం లేదు.
వ్యాపార సంస్థలపై వల్లమాలిన ప్రేమ
నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాల దుకాణాలముందు పెట్టుకున్న బోర్డులనుంచి ప్రకటనల పన్నులను వసూలు చేసేందుకు టెండర్ నిర్వహించి, ప్రైవేట్ సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. 2012–13 ఏట పన్నుల రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2013–14 నుంచి టెండర్లు పిలవకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వసూలు చేస్తున్నారు. 2013–14లో గ్లో సైన్ బోర్డుల ద్వారా రూ.13.30 లక్షలు వసూలు చేశారు. 2014–15లో రూ. 52.39 లక్షలు, 2015–16లో రూ.9.54 లక్షలు, 2016–17లో రూ.4.57 లక్షలు వసూలు చేశారు. కానీ, గత పదేళ్లుగా డబ్బులు వసూలు చేయడం లేదు.
రూ.20 కోట్ల ఆదాయానికి గండి..
గత పదేళ్లుగా ప్రకటనల బోర్డు ఆదాయాన్ని విస్మరించడంపై బల్దియాకు సుమారు రూ.20 కోట్ల మేర ఆదాయం నష్టపోవాల్సి వచ్చింది. ఆస్తి పన్ను చెల్లించకపోతే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల తలుపులు, కిటికీలు, టీవీలు, ఫర్నిచర్ జప్తు చేస్తూ పరువు తీస్తారు. కానీ, వ్యాపార నిర్వాహకుల నుంచి గ్లో సైన్ బోర్డుల ప్రకటనల పన్నులు వసూలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన వ్యాపార వాణిజ్య సంస్థల వల్ల ఏడాదికి సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం రాకుండా పోతున్నట్లు అంచనా.
వరంగల్ జేపీఎన్ రోడ్డులో దుకాణాలకు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులు
పదేళ్లుగా వసూలు చేయని టౌన్‌ప్లానింగ్ విభాగం
బల్దియా ఆదాయానికి భారీగా గండి
ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయకపోవడంపై విమర్శలు
దుకాణాల ఎదుట పెట్టుకున్న ప్రకటనల పన్నులను వసూలు చేసేందుకు గ్రేటర్ టౌన్ ప్లానింగ్‌లో ప్రత్యేకంగా విభాగం లేదు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లకు వసూళ్ల బాధ్యతలు కట్టబెట్టారు. సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని వసూలు చేయాల్సి ఉంది. కానీ, వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్దకు ప్రకటనల పన్నుల కోసం వెళ్తున్న వీరు బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. యజమానులనుంచి ఎంతోకొంత తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకటన పన్నుల వసూళ్లపై బల్దియా ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్‌ను వివరణ కోరగా.. ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.


