హన్మకొండ: డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఆదరణ పెరుగుతోంది. హనుమకొండ జిల్లాలో ప్రతి ఏటా 10 శాతం వృద్ధి సాధిస్తోంది. విద్యుత్ వినియోగదారులు బిల్లులను సులభంగా, వేగంగా, ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) డిజిటల్ చెల్లింపు విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇంటి వద్ద నుంచే తమ విద్యుత్ బిల్లులను చెల్లించే సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డిజిటల్ సౌకర్యం రాకముందు వినియోగదారులు బిల్ కౌంటర్ల వద్దకు చేరుకుని వరుసలో నిలబడి బిల్లులు చెల్లించే వారు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తప్పాయి.
అందుబాటులో యాప్‌లు..
ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ తదితర డిజిటల్ చెల్లింపు యాప్‌లతోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్లలోని ఈ యాప్‌ల ద్వారా వినియోగదారులు విద్యుత్ బిల్లును సులభంగా చెల్లిస్తున్నారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధిలోని వివిధ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులు తమకు అనుకూలమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని బిల్లులను సులభంగా చెల్లించవచ్చని విద్యుత్ అధికారులు తెలిపారు.
టీజీఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా..
వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని, విద్యుత్ బిల్లుకు సంబంధించిన యూఎస్‌సీ నంబర్‌ను నమోదు చేయాలి. తద్వారా ప్రతి నెలనెలా విద్యుత్ బిల్లును సులభంగా చెల్లించడంతో పాటు బిల్లు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. డిజిటల్ విధానంలో బిల్లులు చెల్లించడం వల్ల ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం, బిల్లు వివరాలపై ముందస్తు సమాచారం పొందొచ్చు.
సౌకర్యంగా చెల్లింపులు..
హనుమకొండ సర్కిల్‌లో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో 20,06,649 మంది వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించగా, 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 21,13,263 మందికి పెరిగింది. హనుమకొండ జిల్లాలో ఎల్‌టీ, హెచ్‌టీ కలుపుకుని మొత్తం విద్యుత్ సర్వీస్‌లు 5,00,623 ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులు 3,70,724 మంది, వాణిజ్య వినియోగదారులు 49,280 మంది, పరిశ్రమలు 2,152, కుటీర పరిశ్రమలు 500, వ్యవసాయ సర్వీస్‌లు 69,335 ఉన్నాయి.
డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఆదరణ
హనుమకొండ జిల్లాలో 2024–2025లో 20,06,649 మంది చెల్లింపు
2025–26 ఆర్థిక సంవత్సరంలో 21,13,263 మందికి పెరుగుదల
డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ..
విద్యుత్ బిల్లుల డిజిటల్ చెల్లింపులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇంటి వద్ద నుంచి క్షణాల్లో బిల్లులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులందరు అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, సులభంగా, సకాలంలో బిల్లులు చెల్లించాలి.
– బి.సామ్యానాయక్, ఎస్‌ఈ, టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ


