వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఆరోగ్యశాఖతో సమన్వయం చేస్తూ టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ అభియాన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు తమ పరి ధిలో టీబీ ముక్త్ అభియాన్ కమిటీలను ఏర్పాటు చేసి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వైద్యారోగ్యశాఖాధికారి బి.రాజారెడ్డి, నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డాక్టర్ సంధ్యారాణి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంత, ఎన్‌సీసీ కమాండర్ కెప్టెన్ సదానందం, ఎస్.కీర్తనమాల, మండల ప్రత్యేకాధికారులు, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టాలి..
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపునీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పనులు చేపట్టాలని సూచించారు.
39,855 మంది హియరింగ్ పూర్తి
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,94,395 మందికి నోటీసులు జారీ చేయగా 39,855 మంది హియరింగ్ పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. నోటీసులపై నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పూర్తిచేసి తదుపరి ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


