● హనుమకొండ జిల్లాలో 9,896 మంది, వరంగల్ జిల్లాలో 3,234 మంది ఓటర్లు
● ఈనెల 24న నామినేషన్ల స్వీకరణ,
అక్టోబర్ 4న ఎన్నికలు
హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.నవీన్‌కుమార్ విడుదల చేశారు. జాబితాలో మొత్తం 9,896 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతీ నామినేషన్‌ను ఇద్దరు అర్హత కల్గిన సభ్యులు ప్రతిపాదించాలి, సమర్థించాలి. 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికై న మేనేజింగ్ కమిటీ సభ్యులకు ఓటింగ్ నిర్వహించి జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర పాలక మండలి సభ్యులు, కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం, సుబేదారి, హనుమకొండలో జరుగుతుంది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 20 నుంచి రూ.2 వేలు చెల్లించి పొందవచ్చు. సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటల నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ అభ్యర్థికి గరిష్ఠంగా రెండు నామినేషన్లు మాత్రమే ఆమోదిస్తారు. నామినేషన్ పత్రంతో పాటు రూ.10 వేలు నాన్ రీఫండబుల్ భద్రతా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
వరంగల్ జిల్లాలో..
న్యూశాయంపేట: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఎన్.వసంత శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సొసైటీలో మొత్తం 3,234 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.


