గ్రేటర్ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌న్ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. హనుమకొండలోని గోపాల్‌పూర్, కాజీపేట, ప్రకాశ్‌రెడ్డిపేట, పద్మాక్షికాలనీ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుమతించిన ప్లాన్‌న్‌కు విరుద్ధంగా భవనాలు నిర్మించొద్దని, భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రమాణాలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణం పూర్తయిన అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అనుమతి పొందిన ప్లాన్‌న్, వాస్తవంగా నిర్మించిన భవనం మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని కమిషనర్ సూచించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, టీపీఓ అవినాశ్ పాల్గొన్నారు.
నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి
కాశిబుగ్గ; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేశ్ నిమజ్జనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం కోసం అధిక సంఖ్యలో విగ్రహాలను తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా 12వ డివిజన్‌లోని దేశాయిపేట పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.


