నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం

హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌.నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి.. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్‌ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్‌మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్‌తోపాటు, విండ్‌ పవర్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్‌ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్‌ భవనాలపై సోలార్‌ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నారు. కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, అధికారులు పాల్గొన్నారు.

ప్రజాబాట, పొలంబాట ద్వారా

నేరుగా వినియోగదారుల ముంగిటికి

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

మల్లు భట్టి విక్రమార్క

టీజీ ఎన్పీడీసీఎల్‌ చేపట్టిన

రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement