ఇంజనీర్లకు కమిషనర్ టి.వెంకన్న ఆదేశం
వరంగల్ అర్బన్: మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తూ, నాణ్యతతో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ఇంజనీర్లు పర్యవేక్షించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉర్సుగుట్ట సమీపంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించి అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం శివనగర్ అండర్‌బ్రిడ్జి సమీపంలోని నాలాను పరిశీలించారు. డ్రెయినేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి నిల్వ లు, మురుగు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రకాళి బండ్ సమీపంలోని నాలాతో పాటు భద్రకాళి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. బొంది వాగు నాలా నుంచి వచ్చే వరద నీరును నేరుగా భద్రకాళి చెరువులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, నాలాలకు రిటైర్నింగ్ వాల్స్ నిర్మించాలని సమీప ప్రాంతాల హాకర్స్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జీడబ్ల్యూఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు వేగిరం
వరంగల్ 3వ డివిజన్‌లోని పైడిపల్లి డంప్‌యార్డు పరిధిలోని ఏడెకరాల స్థలంలో రోజుకు 150 టన్నుల సామర్థ్యంతో నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిపాదిత బుధవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లుపై సాంకేతిక సెమినార్ కమిషనర్ టి. వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఆర్ కన్సల్టెంట్స్ సంస్థ ప్రతినిధులు ప్లాంట్ రూపకల్ప న, నిర్వహణ విధానం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ప్రమాణాలు, వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్, పునర్వినియోగం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో బల్దియా ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, ఈఈలు మహేందర్, సంతోశ్‌బాబు, రవికుమార్, సంజయ్‌కుమార్, రాజేశ్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఎస్‌ఎస్‌ఆర్ కన్సల్టెంట్స్ ప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


