ప్రమాదాలకు C/o ఎంజీఎం రోడ్డు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు C/o ఎంజీఎం రోడ్డు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

ప్రమాదాలకు C/o ఎంజీఎం రోడ్డు

వరంగల్‌ అర్బన్‌ : నల్లా పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు ప్రధాన రహదారిపై భారీ గుంతలు తీశారు. పైపులైన్‌ మరమ్మతులు చేసి, మట్టిపోసి వదిలేశారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కీలకమైన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. హనుమకొండ, వరంగల్‌ బస్‌స్టేషన్లకు, ఇతర ప్రాంతాలనుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఈ దారిలోనే వెళ్తుంటాయి. నగరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన రహదారిలో రెండు వైపులా తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు తారు వేయకుండానే మట్టితో పూడ్చివేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరగడం, రోడ్డుపై గుంతలను చూడలేక ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సైతం ఇదే రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, వీరికి ఈ గుంతలు, బారికేడ్లు కనిపించడం లేదా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోచమ్మమైదాన్‌–సీకేఎం కాలేజీ రహదారిలో, కాశిబుగ్గ వివేకానంద కాలేజీ నుంచి ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ రోడ్డు, వరంగల్‌ రైల్వేగేట్‌ ఫ్లైఓవర్‌ కింద రోడ్లు, తిలక్‌ రోడ్డు, కరీమాబాద్‌ దసరా రోడ్లలో నల్లా పైపులైన్ల లీకేజీలను అరికట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బల్దియా బాధ్యతాయుతంగా వ్యవహరించి గంతలను పూడ్చివేయాలని, మరిన్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

మూడు నెలలుగా

బారికేడ్లే దిక్కు

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ,

బల్దియా ఇంజనీర్లు

ప్రమాదాల బారిన వాహనదారులు

Advertisement
 
Advertisement
Advertisement