ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాళోజీ సెంటర్‌: జయశంకర్‌ బడిబాట–2026 కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని మించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటా ప్రచారం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించాలని సూచించారు. ఏఐ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా వంటి డిజిటల్‌ విద్యా వనరులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు పెంపునకు భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని, వారికి అందే సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, ఇంటర్‌ పూర్తిచేసిన వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు ప్రభుత్వం విదేశీ పర్యటన అవకాశం కల్పించనుందని కలెక్టర్‌ తెలిపారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, డీఈఓ రంగయ్యనాయుడు, డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌, విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement