వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

న్యూశాయంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి కశాశాలలో శనివారం వరంగల్‌ జిల్లా కార్యకర్తల రెండు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాకే మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొని రైతాంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో సాయిల్‌ హెల్త్‌ కార్డ్స్‌ ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం పీఎం కిసాన్‌, తదితర పథకాల ద్వారా దళారులు లేకుండా ప్రతీ పైసా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఏ చర్చకై నా తాము సిద్ధంగా ఉన్నామని, ఏ చౌరస్తాకై నా వస్తామని సవాల్‌ విసిరారు. రామగుండంలో యూరియా ప్లాంట్‌ను పునఃప్రారంభించింది ఎన్డీఏ మోదీ హయాంలోనే అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైన ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యువతకు మోదీతో కనెక్టివిటీ ఉందని, వారు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, రాణీ రుద్రమదేవి, రాణా ప్రతాప్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement