వరంగల్ స్పోర్ట్స్: అమరావతిలోని ఏపీ యూనివర్సిటీ వేదికగా శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో హనుమకొండ చిన్నారులు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–7 బాలుర విభాగంలో అక్షత్ చౌహాన్ లావుడియా, బాలికల విభాగంలో గుండెకారి హయాతి ఓపెన్ కేటగిరీలో క్లాసిక్ విభాగంలో విజేతలుగా నిలిచారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ట్రోఫీతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.
విద్యారణ్యపురి: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాకు సంబంధించి తొలిరోజు తెలుగు పరీక్షకు 63 మంది విద్యార్థులకు 50 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 64 మంది విద్యార్థులకు 50 మంది హాజరయ్యారని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు.
న్యూశాయంపేట: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో (స్కిల్ డెవలప్‌మెంట్) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం అనుభవం ఉన్న భాగస్వామ్య సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల సంస్థలు తమ వివరణాత్మక ప్రతిపాదనలతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఉచిత శిక్షణ కోసం..
తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అవసరమైన ఐఈఎల్‌టీఎస్ శిక్షణ ఉచితంగా ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ ఇన్‌చార్జ్ మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 15లోగా అందించాలని, పూర్తి వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
కాశిబుగ్గ: వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జీఎస్‌కే ధర్మరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి, పదోన్నతిపై సూపరింటెండెంట్‌గా వరంగల్‌కు వచ్చారు. ఇంతవరకు ఆస్పత్రి ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మరాజుకు పలువురు వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మొబైల్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రిక్నగ్నేషన్ అటెండెన్స్) మొబైల్ యాప్ సేవలకు అంతరాయం కలిగిందని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పనిచేయడం లేదని, ఈనెల 7వతేదీ వరకు మాన్యూవల్‌గా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ, వివిధ కార్యాలయాల్లోని పలు విభాగాల్లో, కళాశాలల్లో డివైస్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు పనిచేస్తోందని, వారు యథావిధిగా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.


