వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడకు వరంగల్ మహానగరంలో ఆదరణ కరువైంది. తమ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్న పాలకుల మాటలు ఆచరణలో శూన్యంగానే మిగులుతున్నాయి. హైదరాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌లో హాకీ క్రీడా మైదానం లేకపోవడం బాధాకరం. హాకీ నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ అందుకు తగిన కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు క్రీడను మధ్యలోనే వదిలేయాల్సిన దుస్థితి. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా హనుమకొండలోని నయీంనగర్‌లో హనుమకొండ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ క్రీడా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వసతులను ఉపయోగించుకుంటూ చిన్నారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈనేపథ్యంలో నయీంనగర్ హాకీ క్లబ్‌పై ప్రత్యేక కథనం.
40 ఏళ్ల చరిత్ర..
సుమారు 40 ఏళ్ల క్రితం స్థానిక హాకీ క్రీడాకారులు ములకల నర్సయ్య, గొడిశాల ఈశ్వరయ్య మొదటిసారిగా నయీంనగర్‌లో హాకీ ఫీల్డ్ కోర్టుకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సుమారు అర ఎకరం స్థలంలో ఏర్పాటైన హాకీ ఫీల్డ్ గ్రౌండ్ కొన్నేళ్ల తర్వాత హాకీ క్లబ్‌గా రూపుదిద్దుకుంది. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటైన నయీంనగర్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొనసాగాడు. సుమారు పదేళ్ల క్రితం పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో క్లబ్ అధ్యక్షుడిగా ఉండడం విశేషం. ఎమ్మెల్యే నాగరాజు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు, అంతేకాదు ఆయన హాకీ క్రీడా కోటలోనే పోలీస్ ఉద్యోగం సాధించినట్లు అనేక సందర్భాల్లో తెలిపారు. ఆయన సోదరుడు కృష్ణమూర్తి సైతం హాకీ క్రీడాకారుడు కావడం విశేషం.
కనీస వసతులు కరువు?
ప్రస్తుతం నయీంనగర్‌లో గ్రావెల్ కోర్టులోనే క్రీడాకారులు సాధన చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో రాణించాలంటే సుమారు మూడెకరాల స్థలం అవసరం. అందులో ఆస్ట్రో టర్ఫ్ కోర్టు ఏర్పాటుతో పాటు ఆధునిక హాకీ కిట్లు అవసరం ఉంటుంది. అయితే నయీంనగర్ హాకీ క్లబ్‌లో గ్రావెల్ కోర్టులో కనీస సదుపాయాలు లేకుండా క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో జట్టులో 11 మంది చొప్పున 70 నిమిషాల పాటు కొనసాగే హాకీ మ్యాచ్‌లో రాణించాలంటే సదుపాయాలు ఆ స్థాయిలో ఉండాల్సిందే. లేదంటే ఎన్నిరోజులు సాధన చేసిన కాలక్షేపమే తప్పితే ఫలితాలు ఉండవు.
ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారులు
ఉన్నత స్థానాల్లో ఉన్నా పట్టింపు కరువు
నయీంనగర్ హాకీ క్లబ్‌లో హాకీ సందడి
ఆడుకోవాలని ఉన్నా సదుపాయాలు కరువు


