బల్దియా ప్రత్యేకాధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్‌అర్బన్: పారిశుద్ధ్య సేవలకు ఉపయోగించే వాహనాలు ఎట్టి పరిిస్థితుల్లో నిలిచిపోకుండా.. మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కల్టెకర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వాహనాల నిర్వహణ, మరమ్మతులు, ఇంటింటా చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణపై బల్దియా ప్రత్యేకాధికారి ఇంజనీరింగ్, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇంటింటా చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోల మరమ్మతులను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పడు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఇంజనీరింగ్ అధికారులు రాజకమలాకర్, ఈఈ మాధవీలత, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’ వేగవంతం చేయండి
వరంగల్ అర్బన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, బూత్‌లెవెల్ సూపర్‌వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో ఇన్‌చార్జ్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ డివిజన్లలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిపై బూత్‌లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లతో ఆమె సమీక్షించారు. సమావేశంలో తహసీల్దార్లు మహ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, డీటీ సుభాన్, సూపర్వై జర్లు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
పంట అవశేషాలు కాల్చడం నిషేధం..
హన్మకొండ అర్బన్: జిల్లాలో పంట అవశేషాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతం తగ్గడం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజారోగ్యానికి, ప్రాణాలకు ముప్పు వాటిల్లితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రైతులు పంట అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


