కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల మెస్‌ల నిర్వహణలో నిధులను ముందస్తు చెల్లింపుల పేరిట భోంచేసినట్లు తెలుస్తోంది. గత డైరెక్టర్ హయాంలో అడ్వాన్స్‌ల రూపంలో రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించింది. దీనిపై గత హాస్టళ్ల డైరెక్టర్‌తోపాటు మరికొందరికి రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కామన్‌మెస్‌లో గత ఏడాదిలో ఒక్కసారిగా బిల్లులు పెరిగిపోవడంతో విద్యార్థులకు అనుమానం వచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 29న ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్ చైర్మన్‌గా విచారణ కమిటీని వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్ రామచంద్రం వేశారు. పది నెలలకు సంబంధించిన మెస్‌బిల్లులను పరిశీలించాలని ఆదేశించగా ఆ కమిటీ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి విచారణ జరిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు వివిధ బిల్లుల పరిశీలనకు మరో విచారణ కమిటీని గత మార్చి 4న నియమించారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. నిధుల వినియోగంలో ఏమేమి అవకతవకలు జరిగాయి, బాధ్యులెవరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ రామచంద్రం ఆదేశించారు.
ఇష్టారాజ్యంగా అడ్వాన్స్‌లు
కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో గత డైరెక్టర్ హయాంలో హాస్టళ్ల, మెస్‌లకు కలిపి 20మందికిపైగా జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. వీరికి అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు చెల్లించారు. మరో నలుగురు కేర్‌టేకర్లకు కూడా అడ్వాన్స్‌లు చెల్లించారు. ఈ అడ్వాన్స్‌లు హాస్టళ్ల, మెస్‌ల నిర్వహణ కోసమని ఇచ్చారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లకు రూ.50వేల నుంచి రూ.2లక్షలకుపైగా అడ్వాన్స్‌లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఒక్కో జాయింట్ డైరెక్టర్‌కు ఎంతెంత అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారనేది విచారణ కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అడ్వాన్స్‌లు తీసుకొని వ్యయం చేసినట్లు సెటిల్‌మెంట్లు చేయడంలో ఎక్కువ శాతం మంది జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్‌టేకర్లు జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు సమర్పించిన సెటిల్‌మెంట్ల బిల్లులు సరిగా లేవనే అరోపణలున్నాయి. ఏ అవసరం ఉందో వాటికి అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు చెల్లించాక జాయింట్ డైరెక్టర్లు/ కేర్‌టేకర్లు ఆయా డబ్బులను ఖర్చు చేసి బిల్లులు సమర్పించాకే మరో అడ్వాన్స్ ఇవ్వాల్సింటుంది కానీ, అడ్వాన్స్ సెటిల్‌చేయకున్నా కొత్తగా అడ్వాన్స్‌లు ఇచ్చుకుంటూ పోవడంలో ఆంతర్యమేమిటి అనేది చర్చగా ఉంది.
హాస్టళ్ల డైరెక్టర్ నుంచి వివరాల సేకరణ
ప్రొఫెసర్ మనోహర్ విచారణ కమిటీ గత హాస్టళ్ల డైరెక్టర్‌ను పిలిపించి విచారణ జరిపింది. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆ డైరెక్టర్ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు, కేర్ టేకర్లకు అడ్వాన్స్‌లు ఇచ్చిన విషయంతోపాటు అదనపు కార్మికుల అనుచిత వినియోగం, మరికొన్ని అంశాలను అడిగినట్లు తెలిసింది. విచారణ కమిటీ మే 11న కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రానికి నివేదిక అందజేసింది. హాస్టళ్ల, మెస్‌ల నిర్వహణ, అడ్వాన్స్‌లపై నియంత్రణ లేకపోవడం, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నివేదికను వీసీ, రిజిస్ట్రార్ పరిశీలించారు. దీంతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
18మందికి షోకాజ్ నోటీసుల జారీ
కాకతీయ యూనివర్సిటీలోని గత హాస్టళ్ల డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్, 12మంది హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్‌టేకర్లకు రిజిస్ట్రార్ రామచంద్రం ఈ నెల 2న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు / కేర్‌టేకర్లు అడ్వాన్స్‌లుగా తీసుకున్న నిధుల వినియోగంలో సరైన లెక్కలు చూపడంలో విఫలమైనందున, ఆర్థిక ధ్రువీకరణ విధానాలను ఉల్లంఘించినందుకు మీపైన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా ఏడు పనిదినాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నిర్దిష్ట గడువులోపు వివరణ ఇవ్వకపోతే ఆరోపణలు అంగీకరించినట్లుగా పరిగణించి తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గత డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్ కూడా ఏడు పనిదినాల్లో వివరణ సమర్పించాల్సి ఉంటుంది.
కేయూ హాస్టళ్ల మెస్‌ల నిర్వహణలో
అవకతవకలు
ఇష్టారాజ్యంగా ముందస్తు చెల్లింపులు
రెండు విచారణ కమిటీల నివేదికలు అందజేత
హాస్టళ్ల గత డైరెక్టర్‌తో సహా 18మందికి షోకాజ్ నోటీసుల జారీ


