● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
● హోటల్ అశోకాలో కవిసమ్మేళనం
హన్మకొండ చౌరస్తా: నీళ్లు పారే తెలంగాణలో నెత్తురు పారించేలా కుట్రలు సాగుతున్నాయని ఎమ్మెల్సీ, తెలంగాణ వికాస సమితి గౌరవ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని అశోకా కాన్ఫరెన్స్ హాల్ (అనిశెట్టి రజిత ప్రాంగణం)లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు పాతబస్తీ వద్దు.. కానీ, హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్ కావాలి’ అని విమర్శించారు. ఎవరో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎలా ఉంటుంది? వరంగల్ కోటలో రాళ్లు ఎత్తింది మా తాతలు, ముత్తాతలని అన్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని కోన్ కిస్కాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం అనిశెట్టి రజిత మహిళా రచయితలను ఒకటి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ తన పా టలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో కార్యదర్శి విజయ్, భిక్షపతినాయక్, నాగిల్ల రామశాస్త్రి, కవులు వీఆర్ విద్యార్థి, రామా చంద్రమౌళి, శివకుమార్, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి మురళీకృష్ణ పాల్గొన్నారు.


