కొత్తగూడ: ఆదివాసీల పోరాటం లంబాడీలపై కాదని వారిని చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన పాలకులపై అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోరు కేక బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహారాష్ట్రలో బీసీలు, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్సీలుగా ఉన్న లంబాడీలను ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఓ జీఓ ద్వారా ఎస్టీ జాబితాలో కలిపారని ఆరోపించారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోకి వలసలు పెరిగాయన్నారు. దీంతో ఆదివాసీలు విద్య, ఉద్యోగం, రాజకీయ, వనరుల దోపిడీకి గురవుతున్నారన్నారు. దీనిపై జూన్ 30 లోగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తుడుందెబ్బ స్వయంగా చట్టాల అమలుకు పూనుకుంటుందని హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి నీరు, ఇసుక మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. వాటిని దిగ్భందించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి జ్యుడీషియల్ కమిషన్ నియమించి ఏజెన్సీ గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆదివాసీ సమాజాన్ని కాపాడాలని కోరారు. సభలో నాయకులు చుంచు రామకృష్ణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఈసం సుధాకర్, కల్తి వీరస్వామి, కుర్సం సీతారాం, దాట్ల నాగేశ్వరరావు, పొడెం బాబు, నిమ్మక సింహసనం, వంశీకృష్ణ, గోప వీరయ్య, సువర్నపాక పాపారావు, వట్టం సాయిలు, సుంచ సారయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల దిగ్బంధంలో కొత్తగూడ..
తుడుందెబ్బ పోరు కేక బహిరంగ సభను అడ్డుకుంటామని లంబాడీ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో పోలీసులు కొత్తగూడ మండల కేంద్రాన్ని దిగ్బంధించారు. ముందస్తుగా వర్తక, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బహిరంగ సభ స్థలంలోకి ఇతరులు రాకుండా తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో భద్రతాఏర్పాట్లు చేశారు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
తుడుందెబ్బ పోరు కేక సభలో వక్తల డిమాండ్


