శాయంపేట: జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు కల్లాలనుంచి ధాన్యం బస్తాల దొంగతనాలకు పాల్పడ్డారు. 8మందితో కూడిన దొంగల ముఠాను శాయంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీష్ బాబు బుధవారం వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఓ యువతి, ముగ్గురు బాలురుతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఏసీపీ సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జీడి రాహుల్, కోడెపాక హేమంత్ కుమార్, ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఓ యువతి, మరో ముగ్గురు మైనర్ బాలురు కలిసి ఐనవోలు, కమలాపూర్, దామెర, హసన్‌పర్తి, శాయంపేట మండలాల పరిధిలోని వడ్ల కల్లాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 242 ధాన్యం బస్తాలు (135.86 క్వింటాళ్లు) దొంగిలించారు. వాటి విలువ సుమారు రూ.3.26లక్షల ఉంటుందని ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. నిందితులు సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని, స్నేహితుడి వద్ద తీసుకున్న మరో కారులో కల్లాలనుంచి వడ్ల బస్తాలను తరలించిన అనంతరం ట్రాలీలు, డీసీఎంలో లోడ్ చేసి గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామ శివారులోని గణేష్ రైస్‌మిల్లుకు విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులను జల్సాలకు వినియోగించుకుని మిగిలిన మొత్తాన్ని పంచుకున్నట్లు గుర్తించామని తెలిపారు. మరో చోరీకి ప్రణాళిక రచించి మండలంలోని వసంతాపూర్ గ్రామ పరిసరాల్లో రెక్కీ చేస్తున్న సమయంలో కొప్పుల బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై జక్కుల పరమేష్, సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిపై కేసు నమోదు చేసి రూ.3,05,200 నగదు, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేష్‌తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. యువత వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు. సెల్‌ఫోన్లలో ఏం చూస్తున్నారో గమనిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ధాన్యం బస్తాల దొంగల ముఠా అరెస్ట్
నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు,
ఓ యువతి
నిందితులను రిమాండ్‌కు తరలింపు


