పరకాల: దోస్తులు ఫోన్ చేశారు..అర గంటలో మళ్లీ వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డుపై తీవ్రగాయాలతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల చర్లపల్లి గ్రామానికి చెందిన ఎం.డీ షర్పోద్దీన్(38), హాజీరాబేగం దంపతులు పరకాలలో అద్దెకుంటున్నారు. హాజీరాబేగం చిట్యాల మండలం కై లాసపురం గ్రామకార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా మృతుడు షర్పోద్దీన్ హనుమకొండలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8.30 గంటలకు దోస్తులు ఫోన్ చేశారు.. కొద్ది సమయంబయటకు వెళ్లొస్తానంటూ వెళ్లిన షర్పోద్దీన్ గంట వరకు కూడా ఇంటికి రాకపోవడం.. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. అనంతరం షర్పోద్దిన్ తండ్రి కూడా తన బంధువుతో ఫోన్ చేయించగా రాత్రి 9.30 గంటకు లిఫ్ట్ చేశాడు. కొంత తడిబడుతూ మాట్లాడిన షర్పోద్దీన్ కొద్ది గంటల్లోనే రోడ్డు పక్కన తీవ్రగాయాలతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే షర్పోద్దీన్‌తోపాటు మరికొందరు మద్యం సేవించినట్లు.. అక్కడే రక్తపు మరకలు ఉండడంతో మృతుడి సోదరుడు రజాక్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
పరకాలలో ఘటన


