సాక్షి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఖిలావరంగల్‌లోని ఖుష్‌మహల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేసి జిల్లా ప్రగతిని మంత్రి కొండా సురేఖ వివరించారు.
ధాన్యం కొనుగోలు..
జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్, యాసంగి సీజన్లలో .8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.913 కోట్లకు పైగా జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల ద్వారా మరో రూ.303 కోట్లు, రైతు భరోసా కింద 1.59 లక్షల మందికి రూ.118.70కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు.
9,483 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 6.58 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,483 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 1,793 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. పాకాల, దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.
రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..
వరంగల్ హెల్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.1,100 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. 458 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మూడు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, మామునూరు విమానాశ్రయ విస్తరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి–163జీ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.
చివరిదశకు పాకాల పనులు..
అటవీ పరిరక్షణలో భాగంగా 31.40 లక్షల మొక్కలు నాటామని, పాకాల ఎకో టూరిజం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. వేడుకల్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీసీపీ అంకిత్‌కుమార్, డీఎఫ్‌ఓ నిఖిత, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమమ, ఉమారాణి పాల్గొన్నారు.
ఇందిరమ్మ పత్రాలు, చెక్కుల పంపిణీ
స్నేహ గ్రూప్స్ ద్వారా 11 మంది విద్యార్థినులకు సైకిళ్లు, రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు, 102 మహిళా సంఘాలకు రూ.12 కో ట్ల రుణాల చెక్కులు అందించారు. విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సంక్షేమం, సదుపాయాల కల్పనలో రాష్ట్రం పురోగతి
రాష్ట్ర అటవీ, పర్యావరణ,
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్ ఖుష్ మహల్‌లో
రాష్ట్ర అవిర్భావ వేడుకలు


