కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెల్లవారుజాము నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలొచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించి గోదావవరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. దంపతి స్నానాలు చేశారు. పితృతర్పనాలు, పిండప్రదాన పూజలు నిర్వహించారు. నదీమాతకు నైవేద్యం సమర్పించి, చీరసారె సమర్పించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు.
కిక్కిరిసిన క్యూలైన్లు..
శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. దీంతో అధికారులు వెనువెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను పంపించారు. ఆలయంలో శివకల్యాణ మండపం వద్ద యాగశాలలో వేద పండితులు మహారుద్ర హోమం, నిర్వహించారు. రాత్రి 7గంటలకు వేములవాడ పండితులతో మహా లింగార్చన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పీఠాధిపతి పూజలు..
మెదక్‌లోని కొల్చారం పీఠాధిపతి శ్రీమాధవానందసరస్వతిస్వామి ఉదయం పుష్కర స్నానం చేశారు. నదీమాతకు పసుపు, కుంకుమ, చీరసారె సమర్పించి పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందాదేవి, శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వచన వేదిక వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాత్రి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. జెన్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమి షనర్ హనుమంతరావు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుశైలజా దంపతులు, అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా కాళేశ్వరముక్తీశ్వరస్వామివారిని దర్శనం చేసుకున్నారు.
వైభవంగా హారతి..
కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవంగా నిర్వహించారు. దీనిని చూసి తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. అనంతరం తెప్పోత్సవాన్ని హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి జలవిహారం చేశారు. కార్యక్రమంలో మాధవానంద సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, చైర్మన్ మోహన్‌శర్మ, ఈఓ మహేశ్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు లక్షన్నరకుపైగా భక్తులు పుష్కర స్నానం చేసి ఆలయంలో దర్శనాలు చేసుకున్నట్లు ఆలయ అదికారులు అంచనా వేశారు.
పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
లక్షన్నర మంది పుణ్య స్నానం
వైభవంగా నవరత్నమాల హారతి,
తెప్పోత్సవం
కొల్చారం పీఠాధిపతి పూజలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్,
సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు


