ఇద్దరు అటవీ శాఖ అధికారులపై దాడి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అటవీ శాఖ అధికారులపై దాడి

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

భూపాలపల్లి రూరల్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిలా గణపురం మండలం చెల్పూరు రేంజ్‌ పరిధి లోని ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో పోడు చేస్తున్న వారిని అడ్డకున్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. చెల్పూరు ఎఫ్‌ఆర్‌ఓ చంద్రమౌళి కథనం ప్రకారం.. ఉదయం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఆముదాలపల్లి గ్రామ అటవీప్రాంతంలో ట్రాక్టర్‌ డోజర్‌తో పోడు పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ బీట్‌ ఆఫీసర్లు రాజేందర్‌, రంజిత్‌, నాగలక్ష్మి పనులపై ఆరాతీసి పోడు చేయవద్దని అడ్డుకున్నారు. గతంలో పోడు చేసిన భూమి చుట్టూ ట్రెంచ్‌ వేశారు. కమలాపూర్‌ గ్రామానికి చెందిన తోట సంతోష్‌ తన కుమారుడితో కలిసి ట్రెంచ్‌ను పూడ్చి, పోడు చేస్తుండగా అడ్డుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడిలో చెల్పూరు రేంజ్‌ పరిధికి చెందిన బీట్‌ ఆఫీసర్లు రంజిత్‌, రాజేందర్‌ స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు. పోడుకు ఉపయోగించిన ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి కమలాపూర్‌ ఫారెస్టు నర్సరీలో ఉంచినట్లు వివరించారు. దాడి చేసిన సంతోష్‌ కుటుంబ సభ్యులపై భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బీట్‌ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement