ఖిలా వరంగల్: విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిండా ముంచుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలకు అధికారులే అండగా ఉంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ విమర్శించారు. వరంగల్ శివనగర్‌లోని సీపీఐ తమ్మెర భవనంలో ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో అభిరామ్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టెక్నో, డిజీ స్కూళ్ల పేర్లతో ఫ్లెక్సీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సూర్య, వంశీ, శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


