కాశిబుగ్గ: ప్రభుత్వం ఆసరా ఫించన్‌దారుల కోసం నిర్వహిస్తున్న ముఖ గుర్తింపు (ఫేస్ అథెంటిక్) ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతీ డివిజన్‌లో ఫించన్‌దారుల ముఖగుర్తింపు కోసం ఫొటోలు తీయడంలో ఇక్కట్లకు గురవుతున్నామని అధికారులు చెబుతున్నారు.
ఫొటోల అప్‌లోడ్‌లో సమస్యలు
చాలా ఏళ్ల క్రితం పింఛన్‌దారులు ఫొటోలు దిగడం, సుమారు పదిహేను ఏళ్ల క్రితం ఆధార్‌కార్డు తీసుకోవడం వల్ల అప్‌లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పింఛన్‌దారుల ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక మీసేవ కేంద్రాల చుట్టూ ఫించన్‌దారులు తిరగాల్సి వస్తోంది. ఆధార్‌లో తెలంగాణగా మార్చుకోవడానికి రెసిడెన్షియల్ పత్రం తీసుకురావాలని ఆధార్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పింఛన్‌దారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి
రెసిడెన్షియల్ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ కార్యాలయం ద్వారా సదరు సర్టిఫికెట్ జారీ చేయడానికి కనీసం వారం, పది రోజులు పడుతోందని పింఛన్‌దారులు చెబుతున్నారు. త్వరగా రావాలంటే మీసేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా డబ్బులు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ గుర్తింపు ప్రక్రియలో ఫొటో సెల్‌లో తీసుకున్నప్పుడు వృద్ధుల ముఖ కదలికలు మారితే తీసుకోవడం లేదని అధికారులు అంటున్నారు. కంటి ఆపరేషన్లు చేసుకున్న వారి ఫొటోలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ముఖగుర్తింపునకు బదులు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
దివ్యాంగులు, మానసిక దివ్యాంగులకు
తప్పని తిప్పలు
దివ్యాంగులు, మానసిక దివ్యాంగులు ముఖ గుర్తింపు కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అసలే, వేసవికాలం ఆపై ఎండలు తీవ్రంగా ఉండడంతో భయపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ముఖ గుర్తింపు కోసం సిబ్బందిని ఇళ్ల వద్దకే పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వయస్సు పైబడి నడవలేని వారి ఫొటోలను కూడా ఇంటి వద్దే తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ గుర్తింపు గడువును జూన్ 15 కాకుండా మరో నెల రోజుల పాటు పొడిగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ అని
ఉండడంతో నిరాకరిస్తున్న అధికారులు
మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ఆసరా లబ్ధిదారులు


