హన్మకొండ చౌరస్తా: ప్రపంచ అత్యవసర వైద్యసేవల దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని అజర ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవల ప్రాముఖ్యం, వేగవంతమైన చికిత్స, ప్రాణ రక్షణలో సమయస్ఫూరి అనే అంశాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అజర ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అత్యవసర వైద్య విభాగంలో ప్రతీ సెకన్ ఎంతో విలువైనది, సరైన సమయంలో నైపుణ్యంతో కూడిన వైద్యసేవలు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ఎల్లప్పుడూ అత్యాధునిక ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సేవలను రోగులకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వివిధ ఆస్పత్రుల వైద్యులు ఒకే వేదికపై కలిసి అత్యవసర వైద్యసేవలపై చర్చించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ నగర, పరిసర ప్రాంతాలకు చెందిన పలు ప్రముఖ ఆస్పత్రుల వైద్యులు, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, అనస్తీషియన్లు, సర్జన్లు, పల్మనాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


