పరకాల : పరకాల పట్టణంలోని అంతర్గత రహదారులపై స్థానికులు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను తవ్వడంతో పాటు తమ పిల్లల జాగ్రత్త కోసం కొందరు వాహనాల స్పీడ్ నియంత్రణ కోసం ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణంలోని సగరవీధి నుంచి బ్రహ్మణవాడ వరకు 500 మీటర్ల దూరంలోనే 15 స్పీడ్ బ్రేకర్స్ ఉండగా..రాజిపేట కాలనీలో 100 మీటర్ల దూరంలో ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. అదే విధంగా చందుపట్ల వాడలో సైతం ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు పెట్టడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే మాదిరిగా ఓ కాలనీలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయగా ఓ యువకుడు వాహనం అదుపు తప్పి, బండపై పడి తలకు బలమైన గాయమై.. మృత్యువాత పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం బయటికి రాకుండా రాత్రికి రాత్రే అయా స్పీడ్ బ్రేకర్లు తొలగించారు. మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వారు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు నరకం చూపిస్తుంటే పోలీసు యంత్రాంగం కానీ మున్సిపల్ అధికారులు కాని చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
రాత్రి వేళల్లో ప్రమాదాలు
వీధుల్లో ఇష్టారాజ్యంగా స్పీడ్ బ్రేకర్లు


