హన్మకొండ చౌరస్తా: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతిని హనుమకొండలోని డీసీసీ భవన్‌లో బుధవారం నిర్వహించారు. ఈ మేరకు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ దేశ నవనిర్మాణంలో పండిట్ నెహ్రూ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ బాయ్స్ హాస్టల్‌లో ఆరు ఫ్యాన్లు, ఒక టేబుల్ ఫ్యాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆ హాస్టల్ భవనానికి తాళం వేసి ఉంది. కిటికి ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి చోరీ చేసినట్లు తెలుస్తోంది. జాయింట్ డైరెక్టర్ గదిలోని టేబుట్ ఫ్యాన్‌తోపాటు హాస్టల్‌లో ఒక చోట ఉంచిన ఆరు ఫ్యాన్ గడ్డలను అపహరించినట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేయూ పోలీస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అలాగే, యూనివర్సిటీ వీసీ భవనం వెనుక నూతనంగా నిర్మించిన టాయ్‌లెట్‌లోని ట్యాప్‌లు కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల క్యాంపస్‌లోని మైక్రో బయాలజీ విభాగంలో ఓ గదిలో ఉండే కంప్యూటర్లకు సంబంధించిన స్క్రాప్‌ను ఎత్తుకెళ్లారు. కొన్నినెలల క్రితం కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని ఓ గదిలోని ప్రొజెక్టర్‌ను, మరో భవనంలో మరో ప్రొజెక్టర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. గతంలోనూ ఆడిటోరియంతోపాటు వివిధ చోట్ల పలు చోరీలు జరిగాయి. కాకతీయ యూనివర్సిటీలో 107మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వివిధ షిఫ్ట్‌ల్లో పని చేస్తుంటారు. పర్యవేక్షణకు రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. వరుస చోరీల ఘటనలను చూస్తుంటే కాకతీయ యూనివర్సిటీలో భద్రత అంతంత మాత్రమేననే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. చోరీల ఇంటి దొంగల పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


