వరంగల్ క్రైం: అప్పగించిన పనులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్‌స్పెక్టర్లు దేవేందర్, హరికృష్ణ బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయన్నారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు.
కాశిబుగ్గ: పేద వర్గాల ఆరోగ్య రక్షణ కోసం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. ఈ మేరకు రూ.50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు వరంగల్ తూర్పులోని ఓసిటీ క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీఎం ఫండ్ ద్వారా చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువ నిధులు కేటాయిస్తూ పేదలకు ఆదుకుంటున్నారని తెలిపారు.
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
దామెర : తప్పిపోయిన పసిపాపను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొర్రి మౌనిక–తిరుపతి దంపతుల మూడేళ్ల కుమార్తె బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో పాప తల్లిందుడ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీస్‌లు చిన్నారి ఆచూకీ కోసం మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే పక్కింట్లోనే ఉన్నట్లు గుర్తించారు. గంట వ్యవధిలోనే పాప ఆచూకీని కనిపెట్టి దంపతులకు అప్పగించారు.
సర్పంచ్‌ల ఫోరం మండల
అధ్యక్షుడిగా నవీన్
దామెర : సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మండలంలోని దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో బుధవారం మండలంలోని సర్పంచ్‌లు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 గ్రామాలకు 8 మంది బీఆర్‌ఎస్, 2 బీజేపీ సర్పంచ్‌లు హాజరై సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పెంచాల స్వరూప (పులుకుర్తి), ఉపాధ్యక్షులుగా కొట్టె శ్రీవాణి (పసరగొండ), దాడి వసంత (తక్కళ్లపహాడ్), కార్యవర్గ సభ్యులుగా చుక్క వనిత (కోగిల్వాయి), వడ్డెపల్లి చంద్ర (సింగరాజుపల్లి)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన సర్పంచ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హన్మకొండ: అల్లుడి హోటల్ కోసం న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ వడ్డేపల్లిలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశా, పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో ఏం తెప్పించావో గుర్తు చేసుకో.. అప్పుడు నీ వెంట పోలీసులు పడితే తప్పించుకొని వడ్డేపల్లిలోని మన కామన్ ఫ్రెండ్ చిన్నాను పట్టుకొని మా అన్న దగ్గరికి వచ్చిన విషయం మర్చిపోయావా.. అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఆయనకు అండగా ఉంటామన్నారు.
హసన్‌పర్తి: ఇటీవల మరణించిన 65వ డివిజన్ ఎల్లాపురానికి చెందిన మిద్దెల చిలుకమ్మ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం చేశారు. బాధితురాలి ఇంటికి బుధవారం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.


