ఎల్కతుర్తి : పర్యావరణ పరిరక్షణకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మండలంలోని కోతులనడుమ నుంచి వీరనారాయణపూర్, వల్బాపూర్ నుంచి దండేపల్లి వరకు ఇందిరానగర్ నుంచి గోపాల్‌పూర్ వరకు కోతులనడుమ క్రాస్ నుంచి జీల్గుల, జగన్నాథ్‌పూర్ వరకు తిమ్మాపూర్ నుంచి కేశవాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం భానుడి ప్రతాపానికి తల్లడిల్లుతున్న ప్రయాణికులకు ఆ చెట్లు నీడనివ్వడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వడ గాలులకు వాహనదారులు ఎండ తీవ్రత తట్టుకోలేక చెట్ల కింద వాహనాలను నిలుపుకొని సేదదీరుతున్నారు. ప్రస్తుతం చెట్ల ఆకులు రాలిపోయి కొత్త ఆకులతో పచ్చని హారంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే కురిసిన చిరుజల్లులకు చెట్లు పచ్చదనంతో నిండుకుని రహదారులకు ఇరువైపులా ఆకుపచ్చ తోరణాన్ని తలపిస్తున్నాయి. అటుగా వెళ్లే బాటసారులకు, ప్రయాణికులకు నీడనివ్వడంతో పాటు ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నాయి. రహదారుల వెంట నాటిని గానుగ చెట్లు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో మొక్కలు ఎండ తీవ్రతకు ఎండిపోకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు చెట్ల వినియోగం, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, మనుగడ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఎల్కతుర్తి నుంచి కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి, అలాగే అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి నాటిన మొక్కలు సైతం చెట్లుగా ఎదిగి నీడను అందిస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


