● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం బాధితులు అబ్బు జనార్దన్‌రెడ్డి, అబ్బు రాజిరెడ్డి, అబ్బు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు, అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ఉన్నారు.
తహసీల్దార్ పరిశీలన
పెద్దకోడెపాక అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈదురుగాలి రావడంతో పక్కనే మండుతున్న మొక్కజొన్న సొప్ప నుంచి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. జీఓ 27 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు, పంట అవశేషాలను తగలబెట్టడం నిషేదమన్నారు. రైతులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5000 నుంచి రూ. 25,000 వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.


