రెగ్యులర్ కార్మికుల స్థానంలో ఇతరుల విధులు
వరంగల్ అర్బన్: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. వీరిలో కొందరు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్ల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే కొందరు పారిశుద్ధ్య కార్మికులు తమ స్థానంలో మరొకరిని నియమించుకుని పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గం లేదు. రెగ్యులర్ కమిషనర్ లేరు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నట్లు సమాచారం.
ప్రజారోగ్యం వదిలి ఇతర విభాగాలకు..
బల్దియా ప్రజారోగ్య విభాగంలో మొత్తం 2,667 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆ విభాగాన్ని వదిలి ఇతర విభాగాలకు వెళ్తున్నారు. కానీ, ప్రతీనెలా వీరికి బల్దియా పక్కాగా వేతనాలు అందిస్తోంది. కొందరు కార్మికులు కార్యాలయాల్లో, సర్కిల్ ఆఫీస్, వార్డు కార్యాలయాల్లో ఆఫీస్ సబార్డినేటర్లుగా చేరి టీ, కాఫీలు అందిస్తున్నారు. ఇంకొందరు వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్ల నిషేధం, డంప్ యార్డు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు, జవాన్లకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సవ్యంగా సాగడం లేదు. వాస్తవానికి కార్మికులు ఎక్కడి వారు అక్కడ పనిచేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. పారిశుద్ధ్య విభాగంలో కొందరు మరో విభాగానికి వెళ్లి పోతుండడంతో నగరంలో పలు డివిజన్లలో పారిశుద్ధ్య విభాగంపై ప్రభావం పడుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పని కార్మికుల కొరత ఉందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల లెక్కలు పూర్తిగా వెలికి తీస్తే వాస్తవంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సహసం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఒకరి బదులు మరొకరు..
గ్రేటర్‌లో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు 167 మంది ఉన్నారు. అందులో 70 శాతం మంది కేవలం ఉదయం వేళ ఫేస్ మొబైల్ యాప్‌లో అటెండెన్స్ వేసి ఇంటి ముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సీనియార్టీ ప్రకారం.. నెలకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు అందుతున్నాయి. వీరిలో 70 శాతం మంది పనులకు వెళ్లకుండా వేరొకరిని ఏర్పాటు చేసుకుని నెలవారీ శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు, జవాన్లకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనం ఇస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం తదితర కారణాల వల్ల బదిలీ కార్మికుడితో పనిచేయిస్తూ వారికి నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు తూతూమంత్రంగా పనిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా బదిలీ కార్మికులను నియమిస్తే ఒక్కో శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు నెలవారీ మామూళ్లను ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇక జవాన్లు తామేం తక్కువంటూ రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.వెయ్యి చొప్పున దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బదిలీ కార్మికుడిని నియమిస్తే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు రూ.2వేలు, జవాన్‌కు రూ.వెయ్యి చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై బల్దియా సీఎంహెచ్‌ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. డిప్యుటేషన్‌పై, బినామీ కార్మికులుగా పనిచేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇందుకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు
సహకరించినందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్ల వసూళ్లు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇష్టారాజ్యం


