కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాము 2023–24 విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందామని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాము రెండో సెమిస్టర్‌లోనే ఉన్నామని, ఇప్పటికీ తమకు పుస్తకాలు సైతం ఇవ్వలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 7నుంచి డిగ్రీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండో సెమిస్టర్ విద్యార్థులు కొందరు ఆందోళనకు దిగారు.
మూడేళ్లు కావొస్తున్నా..
తాము డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొంది మూడేళ్లు కావస్తోందని, ఆరో సెమిస్టర్‌లో ఉండాల్సి ఉండగా, ఇంకా రెండో సెమిస్టర్ పరీక్షలే ఇప్పుడు జరగుతున్నాయని, ఇలా అయితే, తమ డిగ్రీ ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత వర్సిటీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలేదని, పరీక్ష ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌ను కలిసేందుకు యత్నించగా.. డైరెక్టర్ సురేశ్‌లాల్ అందుబాటులో లేరు. అక్కడినుంచి వారంతా రిజిస్ట్రార్ చాంబర్‌కు వెళ్లారు. రిజిస్ట్రార్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీసీ చాంబర్ వద్దకు వెళ్తుండగా.. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ విద్యార్థులతో మాట్లాడారు. వెంకట్రామ్‌రెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ సురేశ్‌లాల్‌కు ఫోన్ చేసి విద్యార్థులతో మాట్లాడించారు. సురేశ్‌లాల్ మాట్లాడుతూ ‘వాస్తవంగా విద్యార్థులు ఆరో సెమిస్టర్‌లో ఉండాలని, ఇక నుంచి ప్రతీ మూడు నె లలకు ఒక సెమిస్టర్ చొప్పున మిగతా సెమిస్టర్లు పూర్తి చేస్తామని, స్టడీ మెటీరియల్ అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు.
మూడేళ్లు గడుస్తున్నా ఇంకా
రెండో సెమిస్టర్‌లోనే..
ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలే..
కేయూ దూరవిద్య డిగ్రీ విద్యార్థుల
ఆందోళన


