హన్మకొండ: హనుమకొండ జిల్లాలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి అధికారులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణను మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా గణన ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. జన గణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు, మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఈ దశ మే 11 ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జన గణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి దాదాపు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఇంటింటికీ ఎన్యుమరేటర్లు..
మొదటి దశలో మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అధికారులకు శిక్షణలో వివరిస్తారన్నారు. హైదరాబాద్‌కు చెందిన జన గణన విభాగం సంయుక్త సంచాలకుడు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బి.సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్‌ఓ, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


