లక్ష్యం.. సామర్థ్యం
మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కసరత్తు
విద్యారణ్యపురి: ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ, గ్రామీణ పాఠశాలలకు మధ్య ఉన్న అభ్యసన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2024 న్యాస్ (నేషనల్ అసెస్‌మెంట్ సర్వే) ఫలితాలు, పాఠశాల స్థాయిలో లోటుపాట్లు, విద్యార్థులు సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది. ఈనెల 26న ఎస్‌సీఈఆర్‌టీ జాతీయస్థాయిలో మూడో తరగతి విద్యార్థులకు భాష, గణితంలో సామర్థ్యాలపై ఎఫ్‌ఎల్‌ఎస్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ) నిర్వహించనుంది.
ఇప్పటికే మాక్‌టెస్ట్..
ఈప్రణాళికలో భాగంగా గత డిసెంబర్ 23న జిల్లాస్థాయిలో మూడో తరగతి విద్యార్థులకు బేస్‌లైన్ ఎఫ్‌ఎల్‌ఎస్ మాక్ టెస్టును భాష, గణితంలో నిర్వహించారు. విద్యార్థులకు పఠన అవగాహన, గణిత సామర్థ్యాలు ఎస్‌ఈఆర్‌టీ, ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన అభ్యాస ఫలితాలను విశ్లేషిస్తారు. మాక్ టెస్టులో ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో విద్యార్థిస్థాయిలో విడివిడిగా అధ్యయనం చేసి అవసరమైన అకడమిక్ పరంగా
సామర్థ్యాల పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
టీచర్లలో విద్యాబోధన నైపుణ్యాలు
జిల్లాలోని ఉపాధ్యాయుల్లో విద్యాబోధన నైపుణ్యాల బలోపేతం కోసం స్కూల్‌కాంప్లెక్స్‌లను అకడమిక్ హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వ్యూహాల్లో పఠనవ్యూహాలు, గణిత భావనాత్మక బోధన నమూనాలు, విద్యార్థుల అభ్యసనస్థాయికి సరిపడే వర్క్‌షీట్లు వినియోగంలోనికి తీసుకరానున్నారు.
డ్యూయల్ పీరియడ్..
జిల్లాలోని ప్రతి పాఠశాలలో అమలుచేయనున్న రోజువారీ ద్వికాలిక (డ్యూయల్ పీరియడ్) విధానం ద్వారా మూడో తరగతి విద్యార్థులకు ఉదయం అభ్యాసన బోధన, మధ్యాహ్నం నైపుణ్యాల ఆధారిత మూల్యంకనం జరగనుంది. దీంతో విద్యార్థులు నేర్చుకున్న అంశంపై అదేరోజు నిర్ధారణ అవుతుంది.
జిల్లాలో ప్రత్యేకంగా రూపొందించింది ఇలా..
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో రీడ్స్ అండ్ కౌంట్స్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కథలు, పరిసరాల ఆధారంగా పఠన కార్యకలాపాలు, దైనందిన జీవితానికి అనుసంధానమైన గణిత సమస్యలు, సహచర విద్యార్థుల ద్వారా అభ్యాసం (పీర్‌లెర్నింగ్) వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారు.
మాక్ పరీక్షలు, విశ్లేషణలు
మూడో తరగతి విద్యార్థుల భాషా, గణితం అభ్యసనాలను ఎఫ్‌ఎల్‌ఎస్‌కు సన్నద్ధతకు ఇప్పటికే డిసెంబర్‌లో ఒకమాక్ పరీక్ష నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థులకు మాక్ పరీక్ష నిర్వహించారు. ఇందులో విద్యార్థుల సామర్థ్యాలు ఏమేరకు పెరిగాయనేది తెలియనుంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిచేసి ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎస్ టెస్టుకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేస్తారు. విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లాలో ఇప్పటికే అమలులో ఉన్న ఎఫ్‌ఎల్‌ఎన్ అండ్ లిప్ మానిటరింగ్ వ్యవస్థలను ఎఫ్‌ఎల్‌ఎస్‌తో సమన్వయం చేస్తూ డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోనున్నారు. మాక్ పరీక్షల విశ్లేషణలు ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికల్లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోనుతున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించి ఇంటి విద్యార్థుల్లో అభ్యసనానికి అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సారించనున్నారు.
26న ఎఫ్‌ఎల్‌ఎస్ నిర్వహించాలని ఆదేశాలు..
రాష్ట్ర వ్యాప్తంగా మూడో తరగతి విద్యార్థుల కోసం ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీని ఈనెల 26న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. స్థానిక సంస్థలు, యూఆర్‌ఎస్ పాఠశాలల్లో ఈ అధ్యయనం చేయనున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ), గణిత నైపుణ్యాలు అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఏ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఆ మాధ్యమంలో భాషానైపుణ్యాలు అంచనా వేస్తారు. ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎఫ్‌ఎల్‌ఎస్ ఐటమ్ బ్యాంకు అసెస్‌మెంట్ విధానాల సమాచారాన్ని కూడా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న ప్రాథమిక స్థాయిలోని మూడో తరగతి విద్యార్థులకు ఈ ఎఫ్‌ఎల్‌ఎస్ ఉంటుంది.
విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం..
హనుమకొండ జిల్లాలో మూడో తరగతి విద్యార్థులను ఎఫ్‌ఎల్‌ఎస్ (టెస్టుకు)కు సన్నద్ధత చేస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. జిల్లాస్థాయిలో హెచ్‌ఎంలు, మూడో తరగతి విద్యార్థులు, విద్యాభోజనచేసే ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం జారీచేశాం. ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఎల్‌ఎస్ ఐటం బ్యాంకు ,మాక్‌టెస్టు పత్రాల వినియోగంపై దృష్టిసారించాం. మరో రెండు మాక్‌టెస్టులు నిర్వహించి, రెమిడియల్ బోధనచేపట్టి ఈనెల 26న జరగనున్న ఎఫ్‌ఎల్‌ఎస్‌కు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం.
– బండారు మన్మోహన్,
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్
ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన
పాఠశాల విద్యాశాఖ
ఇప్పటికే మాక్ టెస్ట్‌ల నిర్వహణ..
ఈ నెల 26న ఎఫ్‌ఎల్‌ఎస్
లక్ష్యం.. సామర్థ్యం


