
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
కాజీపేట పరిధి పేదల
భూములపై పె(గ)ద్దల కన్ను
● కొందరు టీంగా ఏర్పడి ఖాళీ ప్లాట్లకు ఎసరు..
● సెటిల్‌మెంట్.. కాదని ఎదురుతిరిగితే
రివర్స్‌గా పోలీస్ కేసు
● గుండెలు బాదుకుంటున్న బాధితులు
● కబ్జాదారులకు నాయకులు,
రౌడీషీటర్ల అండ.. పట్టని అధికారులు
కాజీపేట: వరంగల్ ట్రై సిటీలో కాజీపేట ప్రధానమైంది. ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉండడంతో ధరలు కూడా ఎకరాకు రూ.కోట్లు పలుకుతున్నాయి. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల్లోని పేదల భూములపై కబ్జాదారులు గద్దల్లా వాలుతూ తమ దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఈ మండలంలోని 19 వీలిన గ్రామాల్లో ఈ దందా ఇటీవల కాలంలో యఽథేచ్ఛగా సాగుతోంది. రాజ కీయ నాయకుల అండదండలు దండిగా ఉన్న కొంతమంది దౌర్జన్యంగా వ్యవహరిస్తూ చిన్న, మధ్య తరగతి ప్రజల భూములు, ప్లాట్లను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని భయానికి గురిచేస్తూ, దాడులకు దిగుతూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. అదీ కుదరకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టిస్తూ బాధితులను భయబ్రాంతులకు గురి చేసి పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు చోటామోటా.. నేడు కోటీశ్వరులు
కాజీపేట పరిధిలో ఒకప్పుడు చోటామోటాగా ఉన్న వారు నేడు భూకబ్జాలు చేస్తూ లక్షలకు, కోట్లకు పడగలెత్తుతున్నారు. బాధితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నప్పటికీ వారి విషయంలో స్పందించని సంఘాలు, నాయకులు కబ్జాదారులకు వంతపాడడంపై ప్రజలు మండిపడుతున్నారు. తమకో న్యాయం, కబ్జాదారులకో న్యాయమా.. అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలువురు బాధితులు ఈ కబ్జాల విషయమై సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరు తూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆ సమయంలో సీపీ వెంటనే భూకబ్జాదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇక్కడి నాయకుల జోక్యమో.. లేక కబ్జాదారుల చేతివాటమో తె లియదుగానీ కబ్జాదారుల హవా మాత్రం తగట్లేదు.
సీపీ గారూ.. జర దృష్టి పెట్టండి
కాజీపేట చుట్టు పక్కల గ్రామాల్లో నానాటికీ పెరుగుతున్న భూకబ్జాదారుల బాగోతాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ దృష్టి పెట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. తాము బహిరంగంగా మాట్లాడితే కబ్జాదారులు ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నామని వాపోతున్నారు. పెట్రేగిపోతున్న భూకబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
కబ్జాల్లో కొన్ని ఇలా..
ప్రశాంత్‌నగర్ కాలనీలో కొంతమంది సభ్యులు ఒక టీంగా ఏర్పడి ఏకంగా దాదాపు 18 ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టారు. కొన్ని ప్లాట్లలో భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యింది.
ప్రశాంత్‌నగర్, వడ్డేపల్లి శివారుల్లో 25 ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్లను ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు సదరు ప్రజాప్రతినిధి పుట్టి ఉండకపోవచ్చని యజమానులు కన్నీరు పెడుతున్నారు.
సిద్ధార్థనగర్ కాలనీలో ఓ ఆంగో ఇండియన్‌కు చెందిన విలువైన స్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. దీని వెనుక బలమైన నాయకుడి హస్తం ఉందని కనిపించిన వాళ్లకు చెప్పుకుని రోదిస్తున్నాడు.
మడికొండకు చెందిన ఓ వృద్ధురాలికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, దాన్ని కబ్జా చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు సైతం కబ్జాదారులకే వంతపాడడం చర్చనీయాంశమైంది.
టేకులగూడెం గ్రామ శివారులో ఉన్న ఓ ఐటీఐ యజమానికి చెందిన 3 ఎకరాల స్థలానికి తప్పుడు కాగితాలు సృష్టించి పట్టా చేసుకోవడమే కాకుండా రెండున్నర కోట్లకు విక్రయించారు. దీనికి గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ వివాదం కోర్టులో ఉంది.

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025