
చెరువుల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలి
వరంగల్ అర్బన్: గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగే చెరువుల వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి నగరంలోని పద్మాక్షి, సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు, చిన్నవడ్డేపల్లి, కట్ట మల్లన్న చెరువులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భారీ క్రేన్లు, తెప్పలు, బారికేడ్లు, లైటింగ్, మంచి నీటి వసతి, రోడ్ల మరమ్మతులు తదితర ఏర్పాట్లు ముమ్మరంగా ఉండాలని సూచనలిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ్గకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
హంటర్ రోడ్డు జూ పార్కులో ఎస్‌టీపీ
హంటర్ రోడ్డులోని జూ పార్కులో సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని కమిషనర్ ఇంజనీర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో డ్రెయినేజీతో పాటు ఆర్–1 స్మార్ట్ రోడ్డు, జూ పార్క్ నుంచి భద్రకాళి బండ్‌కు వెళ్లే నాలాను పరిశీలించారు. అనంతరం ఖిలా వరంగల్‌లోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు చెందిన చిల్డ్రన్స్ పార్కును పరిశీలించి పార్కులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేశ్ జోషి, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్ బాబు, మాధవీలత, ‘కుడా’ ఈఈ భీమ్ రావు, డీఈలు రవికిరణ్, శివానంద్ ’కార్తీక్ రెడ్డి, ఏఈలు రాగి శ్రీకాంత్, సతీశ్ తదితరులున్నారు.
జూ పార్కులో ఎస్టీపీకి అంచనాలు సిద్ధం చేయండి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్