
ఆబ్కారీకి టెండర్ల కిక్కు!
కాజీపేట అర్బన్: ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న ఎకై ్సజ్ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ప్రతీసారి రెండేళ్ల కాలపరిమితితో టెండర్లకు పిలుపునిస్తారు. వైన్స్ దక్కించుకునేందుకు నిర్వాహకులతో పాటు నూతనంగా మద్యం వ్యాపారంలో రాణించాలనే ఆసక్తి ఉన్న వారు పోటీ పడుతుంటారు. కాగా.. గత టెండర్లలో హనుమకొండ జిల్లా పరిధి 65 వైన్స్‌లకుగాను ప్రతీ టెండర్‌లో దరఖాస్తులు డబుల్ అయ్యాయి. ఆదాయం సైతం రెట్టింపు అయ్యింది. గత టెండర్లలో 6,002 దరఖాస్తులు రాగా.. రూ.120 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈసారి టెండర్లతో 12 వేల దరఖాస్తులు, రూ.240 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
సీన్ రిపీట్ అయ్యేనా?
ఎన్నికల సమయం దగ్గరపడుతోందని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023–25 రెండేళ్ల కాల పరిమితితో మూడు నెలల ముందుగానే టెండర్లను పిలిచింది. 2021–23కు గాను 2023 నవంబర్ వరకు వైన్స్‌కు గడువు ఉండగా.. మూడు నెలల ముందుగానే.. (ఆగస్టు)లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్‌లో నూతన వైన్స్ నిర్వాహకుల నుంచి ముందస్తుగా రుసుం చెల్లించుకుంది. అనంతరం డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు జీఓ నంబర్ 93ను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. గత ఆగస్టులో మాదిరి స్థానిక ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఓ నంబర్ 93ను విడుదల చేయడంతో అదే సీన్ రిపీట్ అవుతుందా? అంటూ వైన్స్ నిర్వాహకులు చర్చించుకుంటున్నారు.
ఆదాయం, దరఖాస్తు రుసుము ఇలా..
వైన్స్ టెండర్లలో పాల్గొనేవారు ఇప్పటి వరకు రూ.2 లక్షలు దరఖాస్తు రుసుముగా చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం దరఖాస్తు రుసుమును రూ.2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ జీఓ 93ను విడుదల చేసింది. రిజర్వేషన్ ఖరారు చేసింది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం వైన్స్‌లను కేటాయించేందుకు నిర్ణయించారు. దీంతో గత టెండర్ల కంటే పెరిగిన దరఖాస్తు రుసుముతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ కిక్కు డబుల్ కానుంది.
హనుమకొండ జిల్లా వైన్స్ (వరంగల్ అర్బన్)లో ఇలా..
హనుమకొండ 25
కాజీపేట 15
వరంగల్ అర్బన్ 12
ఖిలా వరంగల్ 13
ఏడాది దరఖాస్తులు ఆదాయం
2021–23 2,983 రూ.59 కోట్లు
2023–25 6,002 రూ.120 కోట్లు
వరంగల్ రూరల్ జిల్లాలో వైన్స్..
నర్సంపేట 25
పరకాల 22
వర్ధన్నపేట 16
2023–25లో మొత్తం దరఖాస్తులు 2,938
ఆదాయం రూ.58 కోట్లు
వైన్స్ నిర్వాహకుల్లో టెండర్స్ ఫీవర్
విడుదలైన జీఓ.. పెరిగిన రుసుము
డ్రా తేదీల కోసం ఎదురుచూపులు