రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం
కాళేశ్వరం: శ్రావణం..సకలం శుభకరం. చేపట్టిన ప్రతీ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాశివుడికి ప్రీతికరణమైన శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి ఆలయంలో శివనామస్మరణ మార్మోగనుంది. కాళేశ్వరాలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నెలరోజుల పాటు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
లక్షపత్రి పూజ ప్రత్యేకం..
శ్రావణమాసంలో కాళేశ్వరాలయంలో లక్షపత్రి పూజకు ప్రత్యేకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో బిల్వ దళాలతో ‘లక్షపత్రి పూజ’ చేసి మహాశివుడిని పూజిస్తారు. స్వయంగా గర్భగుడిలో ద్విలింగాల స్పర్శ దర్శనం ఉండడంతో భక్తులు ఆసక్తి చూపుతారు. జంటకు( దంపతులు) టికెట్ ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఒక రోజు ఐదుగురికి మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుండగా, బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇదివరకు లక్షపత్రి పూజ టికెట్‌కు రూ.6వేలు ధర ఉండగా, ప్రస్తుతం పెరిగిన నేపథ్యంలో భక్తులకు భారం కానుంది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివార్లకు భక్తులు అత్యధికంగా రూ.వెయ్యి టికెట్ చెల్లించి అభిషేక పూజలు నిర్వహిస్తారు. కాళేశ్వరం దేవస్థాన అనుబంధ దేవాలయాలైన శ్రీశుభానందాదేవి(పార్వతి), శ్రీసరస్వతీ అమ్మవార్ల ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. పార్వతి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు అత్యధికంగా నిర్వహిస్తారు. ఉసిరిచెట్టు వద్ద లక్షవత్తులు వెలిగిస్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఉపవాసదీక్షలు చేస్తారు. మహిళలు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. నెలపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
దేవతారాధన చేయాలి..
శ్రావణమాసం నెలరోజుల పాటు దేవతామూర్తులకు పూజలు నిర్వహిస్తే మంచిది. దేవతారాధన చేయొచ్చు. శ్రావణమాసం శుభకార్యాలకు అనుకూలం. లక్షపత్రి పూజలు నిర్వహిస్తే మహాశివుడి కరుణతోపాటు ముక్తి లభిస్తుంది. భక్తులు ఎక్కువ లక్షపత్రి పూజలపై ఆసక్తి చూపుతారు. కాళేశ్వరంలో ద్విలింగాలకు లక్షపత్రి పూజచేస్తే స్వామివారి మోక్షం లభిస్తుంది.
– పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం
ఆగస్టు 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు
కాళేశ్వరం గర్భగుడిలో ప్రత్యేకంగా
లక్షపత్రి పూజలు, అభిషేకాలు
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్
నుంచి రానున్న భక్తులు
శ్రావణం..శుభకరం
శ్రావణం..శుభకరం