
25నుంచి ఎఫ్‌పీఓఎస్ రాష్ట్రస్థాయి మేళా
వరంగల్: రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓఎస్) రాష్ట్రస్థాయి మేళా ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు వరంగల్ రంగశాయిపేటలో నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) అనురాధ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్రస్థాయి మేళాపై శుక్రవారం అధికారులతో సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ మేళాలో రైతు ఉత్పత్తిదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలానే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులతో కలిసి రంగశాయిపేటలోని మేళా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ, ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రమేశ్, మత్స్యశాఖ అధికారి నాగమణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టి..
ఎల్‌ఆర్‌ఎస్ ఆమోదించిన దరఖాస్తుల ఫీజు వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. హైదరాబాద్ నుంచి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 41,443 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 18,943 మంజూరు చేసి, 1,081 దరఖాస్తులకు ఫీజు సేకరించి, 1,081 ప్రొసీడింగ్‌లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఏఓ అనురాధ