అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్‌లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
స్వగ్రామాల్లో విషాదం..
చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.
కూతుళ్ల మాటలతో
ఉప్పొంగిన తల్లిదండ్రులు..
కానీ, వక్రించిన విధి..
కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు
రోడ్డు ప్రమాదంలో
విగతజీవులైన కూతుళ్లు
గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం


